శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ ఎంతో విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా కార్తీక పూర్ణిమ మరీ ప్రాశస్త్యం కలిగినది. మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం కార్తీక పౌర్ణమి అని చెప్తారు. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసే ఉండే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైనది. మహా శివరాత్రితో సమానమైన ఈ పర్వదినాన్ని ‘త్రిపురి పూర్ణిమ’’, ‘దేవ దీపావళి’ అని కూడా అంటారు.

ఈ కార్తీక మాసం నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు. మహాభారతాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసుర సంహారం చేసింది కూడా కార్తీక పౌర్ణమి రోజే. అందువల్లనే ఈ రోజు ని దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు చెప్తున్నాయి. ఈ నెల అంతా కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు. అంత పవిత్రమైన వేరే ఆలోచనలు లేకుండా మన మనస్సులు పూర్తిగా ఆ పరమాత్మునిపై లగ్నం చేయటానికి ‘శివ టీవి’ వారు… శివ అక్షరమాలా స్తోత్రము ని భక్తితో మనకు సమర్పిస్తున్నారు.

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |సాంబ|
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |సాంబ|
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |సాంబ|
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |సాంబ|

అంటూ అద్బుతంగా సాగే శివ అక్షరమాలా స్తోత్రము లో సుందరమైన రూపము కలవాడు, దేవతలకు అధిపతి, ఈశ్వరుడు, జనులకు ప్రియుడు, విష్ణువుచే పొగడ బడిన వాడు, కీర్తి కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తూ సాగుతుంది. మీరు చక్కగా వినండి..ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందండి.
ఈ పాటని వర్దమాని గాయని అత్తలూరి ప్రవస్తి పాడగా, ప్రముఖ సంగీత దర్శకుడు “సాయి శ్రీకాంత్ ” గారు స్వరపరిచారు

Similar Posts
Latest Posts from daivam.com