
దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో
స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
ఈరోజు మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది.
పురాణోక్తం..
బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి.
లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి.
శమీ పూజ
పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాల్ని జమ్మిచెట్టు మీద ఉంచుతారు. ఆ ఆయుధాలతోనే అర్జునుడు ఉత్తర గోగ్రహణ సమయంలో విజయం సాధిస్తాడు. అలాగే పూర్వకాలంలో చక్రవర్తులు తమ ఆయుధాల్ని, ముఖ్యంగా అస్త్రశస్త్రాల్ని, శకటాల్ని ప్రత్యేకంగా మహర్నవమి నాడు అలంకరించేవారు.
వాటిని విజయదశమినాడు పూజించేవారనీ ప్రతీతి. ఎన్నో రూపాల్లో శక్తిమాత వర్ధిల్లుతోంది. అరిషడ్వర్గాలు వంటి అనేక శత్రువులపై సాధించే విజయానికి ప్రతిబింబమే విజయదశమి. శమింపజేసే తత్వం కలిగిన మాతృశక్తి కాబట్టి ఆమె ‘శమి’ అయింది. కాల స్వరూపిణి అయిన ఆ శ్రీమాత అనుగ్రహంతో మానవ మనోబుద్ధులు సానుకూల దృక్పథంతో కొనసాగాలి. అలా చిత్తశుద్ధితో కోరుకునే శుభ తరుణం- మహర్నవమి!
అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతి భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను.
నివేదన: నువ్వులు, బెల్లమన్నం
ఫలమ్: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి.
మహర్నవమినాడు చేసే ‘చండీ హోమం’ విశేష ఫలితమిస్తుందని భావిస్తారు. అందుకే దాదాపు అన్ని అమ్మవార్ల దేవాలయాల లోనూ చండి హోమం, లక్ష కుంకుమార్చన జరుపుతారు.
జ్యోతిషశాస్త్ర ప్రకారం కూడా
ఈ దశమిని విజయయాత్రకు అంటే సాఫల్యతకు ముహూర్తంగా నిర్ణయిస్తారు. కొన్ని ప్రాంతాలలో విజయదశమి “అపరాజితాదశమి” అనికూడా వ్యవహరిస్తారు. కారణం ఈ రోజున ప్రారంభించిన పనులు ఎప్పడూ విజయవంతం కావటమే అని చెప్తారు.
శమీ శమయతేపాపం శమీ లోహత కంటకా
ధారిణనరునబాణానాం రామస్య ప్రియవాదినీ
కరిష్యమాణ యాత్రాయాం యధాకాలం సుఖంమమ
తత్రనిర్విఘ్న కర్రీత్వం భవశ్రీ రాజపూజితే |