ఆరో రోజు అమ్మ అనుగ్రహం ఇలా..

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్.

శరన్నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు.. ‘బాలా త్రిపుర సుందరి’గా దర్శశనమిస్తుంది. కాత్యాయనిగా పూజిస్తారు. గంధం రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. మహిషాసురుణ్ని సంహరించడానికి త్రిమూర్తుల తేజస్సుతో దేవి అవతరించిన రోజు అది. త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది. బాలార్చన త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. పురాణాల్లో.. బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం. హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట. బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది. ఫల శ్రుతి అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది.ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది.ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.