ఏడవరోజు అమ్మవారు..మహాలక్ష్మిగా అనుగ్రహం

లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవద్ర్భాహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలిక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

సర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతున్నదో , ఆ శక్తే “లక్ష్మీ”!!!!!!! లక్ష్యతే మీయతే అనయా ఇతి లక్ష్మి అని అన్నారు …లక్ష్మణాత్ లక్ష్మి”! ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి. అలా జగత్తుకి హేతభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మీ. శరన్నవరాత్రుల ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది అమ్మవారు. కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. పురాణం ఏం చెప్తోంది మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చండీ సప్తశతి ఏమంటోందంటే… “యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా” అంతే అన్ని జీవులలోనో ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మ నివాసం.. శుభ్రమైన ఇంట్లో, పంటపొలాల్లో, గోపురాళ్లో, తామరపువ్వుల్లో, రత్నాలలో, అద్దం మొదలైనవాటిలల్లో లక్ష్మీ కొలవు అయ్యి ఉంటుంది. అభిషేకం.. ఆవనెయ్య తో గాని, సువర్ణ జలం తో కాని లక్ష్మీ దేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది! తెల్లని, ఎరుపు రంగు పువ్వులతో పూజించి, లక్ష్మి అష్టొత్తరం పఠించాలి. అమ్మవారికి వడపప్పు, చలివిడి, క్షీరాన్నం నివేదన చేయాలి.

త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా త్వయైత ద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం

ఓ లక్ష్మి! ఆన్ని లోకాలకు తల్లివి నీవు. దేవదేవుడు అయిన విష్ణువే తండ్రి. నీ చేత, విష్ణువు చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడింది అని ఇండ్రుడు లక్ష్మీ దేవిని స్తుతించాడు.అందుకే జగదంబతత్వాన్ని గ్రహించి, హృదయం నిండుగా భావన చేస్తే, అమంగళాలకు చోటు ఉండదు. డబ్బుకు లోటు ఉండదు. చిత్తం సుద్ధమవుతుంది. సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి…