ఎనిమిదవ రోజు దుర్గమ్మగా అనుగ్రహం

విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణా౦

కన్యాభి: కరవాలఖేల విలద్దస్తా భిరాసేవితాం!

హసైశ్చక్రగదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గం త్రినేత్రం భజే

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది. ఈ రోజు అమ్మను దుర్గాదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ అష్టమి రోజున దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినంగా పాటిస్తారు. ఈ రోజున వృత్తి వ్యాపారాల్లో స్దిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. పురాణోక్తం.. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహిషాసురుడుని అంతమొందించే సమయంలో కాళికామాత ధరించిన అవతారాలలో దుర్గాదేవి అవతారం ముఖ్యమైనది. శరన్నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు మాత దుర్గ అవతారంలో మహిషారుడితో భీకరమైన యుద్దం చేసిన వైనానికి గుర్తుగా అమ్మ దుర్గాదేవిగా కనిపిస్తుంది. ఫలశ్రుతి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవులను ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. అమ్మ నామాన్ని జపిస్తే సకల గ్రహ బాధలు తొలగిపోతాయి. ఆరాధకులకు దుర్గాదేవి శీఘ్ర అనుగ్రహకారిణి. అర్చన విధానం ఎర్రని బట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. “ఓం దుం దుర్గాయైనమ:” అనే మంత్రం పఠించాలి. చక్రపొంగలి నివేదన చెయ్యాలి. దుర్గా, లలితా అష్టోత్తరాలు పఠించాలి.

నైవేద్యం – చక్రపొంగలి శ్రీ దుర్గా దేవి నిండు ఎరుపు రంగు చీర

ఎవరు చెయ్యచ్చు… సర్వవర్ణాల వారు ,సర్వ మతాల వారు , సకల జనుల వారు, సకల జనులు నిరభ్యంతరముగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ….దుర్గమ్మ! ఈ తల్లి సర్వజీవ అంతర్యామి. సంకటనాశిని. జగన్మాత, స్త్రీ, పురుష వయో భేదం లేకుండా సర్వులు ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ.. మన శక్తి మేరకు అమ్మని పూజించి, ఆవిడ అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాలి….అమ్మని ఆరాధించడం వల్ల సర్వరోగాలు, సర్వ భయాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. ధైర్యం వృద్ధి చెందుతుంది. దుఃఖం నశించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తాయి.. శ్రీ దుర్గా దేవ్యై నమో నమః