శైలపుత్రి నమస్తుతే…తొలి రోజు తల్లి అనుగ్రహం పొందండి ఇలా…

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

అంటూ అమ్మవారి ఆశీస్సులు కోసం సమస్త జనం భక్తితో పూజలు ప్రారంభించారు. దసరా ఉత్సవాలు మొదలైపోయాయి. దేవీ ఆరాధనలో దేశం మొత్తం మునిగిపోయింది. దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించింది. తొమ్మిది విధాలైన అనుష్ఠానాలు, విధి విధానాలతో తొమ్మిది రోజుల వ్రతదీక్ష చేపట్టిందని, ఆ శక్తి వల్ల కలిగిన అప్రమేయ బలంతోనే పదో రోజున రాక్షసులపై పోరాడి,విజయం సాధించిందని పురాణ కథనం. అమ్మవారు మొదటి రోజున అంటే పాడ్యమి నాడు ..శైలపుత్రిగా, హైమవతిగా, పార్వతిగా పూజలందుకుంటుంది. ఒక చేతిలో కమలం, మరోచేత శూలం ధరించి దర్శనమిస్తుంది. పసుపు లేదా బంగారు రంగు వస్త్రాలతో శోభిల్లుతుంది. ఆ తల్లికి కట్టుపొంగలి నివేదన చేస్తారు. ఈ రోజు దీక్ష స్వీకరించి కలశ స్థాపన, ఆవాహనంతో మొదలుపెట్టి నవమి వరకు అమ్మవారిని అర్చిస్తారు. ఈ తొమ్మిది రోజులు..భక్తజనులు షోడశోపచార పూజలు, లలితా సహస్రం, అష్టోత్తర శతనామావళి నిర్వర్తిస్తారు. కుమారి, రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, లలితాదేవితో పాటు విజయదశమినాటి శమీపూజలు అనుగ్రహాన్ని కలిగిస్తాయని భక్తుల నమ్మకం!